Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 66

Janaka talks about Shivadhanush!!

|| om tat sat ||

బాలకాండ
అరువది ఆరవ సర్గ

తతః ప్రభాతే విమలే కృత కర్మా నరాధిపః |
విశ్వామిత్రం మహాత్మానం అజుహావ స రాఘవమ్||

స|| తతః విమలే ప్రభాతే నరాధిపః కృతకర్మా మహాత్మానం విశ్వామిత్రం స రాఘవమ్ అజుహావ ||

తా|| అప్పుడు ఆ నరాధిపుడు ప్రభాతసమయమున తన ప్రాతఃకాల కర్మలను ముగించికొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను.

తం అర్చయిత్వా ధరాత్మా శాస్త్ర దృష్టేన కర్మణా |
రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్య మువాచ హ||

స|| (సః) ధర్మాత్మా శాస్త్ర దృష్ఠేన కర్మణా తం అర్చయిత్వా తదా రాఘవౌ చ మహాత్మానౌ వాక్యం ఉవాచ హ ||

తా|| ఆ ధర్మాత్ముడు శాస్త్రోక్తముగా వారిని పూజయించి రాఘవుడు , మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

భగవన్ స్వాగతం తే అస్తు కిం కరోమి తవానఘ |
భవానాజ్ఞాపయితుమాం ఆజ్ఞాప్యో భవతా హ్యహమ్ ||

స|| భగవన్ ! తే స్వాగతం అస్తు. హే అనఘ ! తవ కింకరోమి | మాం భవాన్ ఆజ్ఞాపయితుమ్ అహం ఆజ్ఞాప్యో భవతా హి |

తా|| "భగవన్ ! మీకు స్వాగతము . ఓ అనఘ ! మీకు ఏమి చేయగలను.మీరు ఆజ్ఞాపించుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని".

ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా |
ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్య విశారదః ||

స|| మహాత్మనా జనకేన ఏవం ఉక్తః స ధర్మాత్మా మునిః వాక్యం వాక్య విశారదః వీరం ప్రత్యువాచ ||

తా|| మహత్ముడగు జనకుడు ఇట్లు పలుకగా ఆ ధర్మాత్ముడు వాక్య విశారదుడు అయిన ముని ఆ వీరునకు ఇట్లు ప్రతుత్తరము ఇచ్చెను.

పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ |
ద్రష్టుకామౌ ధనుశ్రేష్ఠం యదేతత్ త్వయి తిష్ఠతి ||

స|| ఇమౌ దశరథస్య పుత్రౌ క్షత్రియౌ లోకవిశ్రుతౌ యత్ ధనుశ్రేష్ఠం త్వయి తిష్ఠతి ఏతత్ ద్రష్ఠు కామౌ ||

తా|| "ఈ క్షత్రియులైన దశరథపుత్రులు ఇద్దరూ లోకవిశ్రుతమైన శ్రేష్ఠమైన మీ కడనున్న ధనస్సును చూచుటకు కోరిక గలవారు ".

ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ |
దర్శనాదస్య ధనుషో యథేష్ఠం ప్రతియాస్యతః ||

స|| భద్రం తే | ఏతత్ నృపాత్మజౌ ధనుషో దర్శయ | అస్య దర్శనాత్ యధేష్ఠం ప్రతియాస్యతః ||

తా|| "నీకు శుభమగు గాక. ఈ రాజకుమారులు ఇద్దరికీ ధనస్సును చూపించుము. దానిని చూచినతరువాత వారి కోరిక ప్రకారము వెళ్ళెదరు.

ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్|
శ్రూయతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి ||

స|| జనకః ఏవముక్తస్తు మహామునిమ్ ప్రత్యువాచ | ధనుషః యదర్థం ఇహ తిష్ఠతి శ్రూయతాం||

తా|| అట్లు చెప్పబడిన జనకుడు ఆ మహామునికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "ధనస్సు ఇక్కడ యెందుకు ఉన్నదో వినుడు".

దేవరాత ఇతి ఖ్యాతో నిమేష్షష్ఠో మహీపతిః |
న్యాసో అయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా ||

స|| దేవరాత ఇతి ఖ్యాతో నిమేషస్య షష్టో మహీ పతిః ( ఆసీత్) తస్య మహాత్మనా హస్తే భగవన్ దత్తో అయం న్యాసః ||

తా|| "నిమివంశమున ఆరవ చక్రవర్తి దేవరాతుడు ప్రసిద్ధికెక్కిన వాడు . ఆ మాహాత్ముని చేతిలో భగవంతుడు ఇది న్యాసముగా ఇవ్వబడినది".

దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్ |
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్ సలీల మిదమబ్రవీత్ ||

స|| పూర్వం దక్ష యజ్ఞవధే రుద్రస్తు ధనురాయమ్య త్రిదశాన్ వీర్యవాన్ రోషాత్ సలీల మిదం అబ్రవీత్ ||

తా|| "పూర్వము దక్షయజ్ఞము నాశనమగునప్పుడు రుద్రుడు ధనస్సు తీసుకొని కోపముతో దేవతలందరికి ఇట్లు చెప్పెను".

యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః |
వరాంగాణి మహార్హాణి ధనుషా శాతయామి వః ||

స|| భాగార్థినో భాగాన్ న కల్పయతే యస్మాత్ వః మహార్హాణి వరాంగాణి ధనుషా శాతయామి ||

తా|| ’'యజ్ఞములో భాగము అడుగుచున్ననాకు భాగములను చేయకున్న మీ అందరి శ్రేష్ఠములైన శిరోభాగములను ఈ ధనస్సుతో ఖండించెదను’'

తతో విమనస్సర్వే దేవా వై సలీలమిదమబ్రవీత్ |
ప్రసాదయంతి దేవేశం తేషాం ప్రీతోsభవద్భవః ||

స|| హే మునిపుంగవ ! తతః సర్వే దేవాః విమనః దేవేశం ప్రసాదయంతి | తేషాం ప్రీతో అభవత్ భవః||

తా||" ఓ మునిపుంగవ ! అప్పుడు దేవతలందరూ దుఃఖితులై ఆ ఈశ్వరుని ప్రార్థించిరి. ఆయన వారిపై ప్రసన్నుడాయెను".

ప్రీతియుక్త స్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్ |
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః |
న్యాసభూతం తదా న్యస్తమ్ అస్మాకం పూర్వకే విభో ||

స||స సర్వేషాం ప్రీతియుక్తః తేషాం మహాత్మనాం తదేతత్ దేవ దేవస్య ధనూరత్నం విభో దదౌ | తదా పూర్వకే అస్మాకం న్యాసభూతం న్యస్తమ్||

తా|| "ఆయన అందరిపై ప్రేమకలవాడై ఆ మహాత్ములకి ఈ దేవ దేవుల రత్నమువంటి ధనస్సును విభుడు ఇచ్చెను. పిమ్మట మాపూర్వజునికి న్యాసముగా ఇది ఇవ్వబడినది".

అథ మే కృషతః క్షేత్రం లాంగలాదుత్థితా మయా |
క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా ||

స|| అథ మే క్షేత్రం కృషతః మయా లాంగలాత్ ఉత్థితా | క్షేత్రం శోధయితా లబ్ధా ఇతి సీతా నామ్నా విశ్రుతా ||

తా|| " ఆప్పుడు నేను పొలమును దున్నుచుండగా నాగటి చాలునుండి (ఒక కన్య) పైకి వచ్చెను. పొలము దున్నుచుండగా దొరికినందువలన ఈమె సీతా అని ప్రసిద్ధి కెక్కెను".

భూతలాదుత్థితా సాతు వ్యవర్థత మమాత్మజా |
వీర్య శుల్కేతి మే కన్యా స్థాపితేయం అయోనిజా ||

స|| సా భూతలాత్ ఉత్థితా (అపి) తు మమ ఆత్మజా వ్యవర్థత | మే కన్యా అయోనిజా అయం వీర్య శుల్కేతి స్థాపితః||

తా|| "భూతలమునుంచి పైకి వచ్చిన ఆమె నా కూతురు వలె పెరిగెను. అయోనిజ అయిన ఈకన్యకు పరాక్రమమే శుల్కము".

భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్ |
వరయామాసురాగమ్య రాజానో మునిపుంగవ ||

స|| హే మునిపుంగవ !భూతలాత్ ఉత్థితాం వర్థమానాం మమ ఆత్మజాం తాం వరయామాసుః రాజానో ఆగమ్య ||

తా|| "ఓ మునిపుంగవ ! భూతలమునుంచి పైకి వచ్చి పెరిగిన నా కుమార్తెను వరించుటకు చాలామంది రాజులు వచ్చిరి".

తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్ |
వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్ ||

స|| హే భగవన్ ! సర్వేషాం పృథివీక్షితాం తేషాం వరయతాం కన్యాం వీర్యశుల్కేతి సుతాం అహం న దదామి ||

తా|| "ఓ భగవన్ ! నా కుమార్తెను వరించ వచ్చిన రాజులు తగుపరాక్రమశాలురు కానందువలన ఎవరికీ నేను ఇవ్వలేదు.

తతస్సర్వే నృపయః సమేత్య మునిపుంగవ |
మిథిలామభ్యుపాగమ్య వీర్య జిజ్ఞాసవస్తదా ||

స|| తతః సర్వే నృపయః సమేత్య వీర్య జిజ్ఞాసవః తదా మిథిలాం అభ్యుపాగమ్య ||

తా|| అప్పుడు ఆరాజులందరూ కలిసి తమ పరాక్రమము పరిక్షించగోరి మిథిలానగరమునకు వచ్చిరి .

తేషాం జిజ్ఞాసమానానం వీర్యం ధనురుపాహృతమ్ |
న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేsపి వా ||

స|| తేషాం వీర్యం జిజ్ఞాసమానానాం ధనుః ఉపాహృతమ్ | (తే) తస్య గ్రహణే స్తోలనేపి వా న శేకుః ||

తా|| "వారి తమపరాక్రమము ధనస్సుని ఎక్కుబెట్టి పరిక్షించగోరిరి. వారు ధనస్సును ఏక్కుబెట్టుటకు గాని ఎత్తుటకుకాని సమర్థులు కాలేకపోయిరి".

తేషాం వీర్యవతాం వీర్యం అల్పం జ్ఞాత్వా మహామునే |
ప్రత్యాఖ్యాతా నృపతయః తన్నిబోధ తపోధనా ||

స|| హే తపోధనా! నృపతయః వీర్యవతాం వీర్యం అల్పం ఇతి జ్ఞాత్వా తేషాం ప్రత్యాఖ్యాతా తన్నిబోధ ||

తా|| "ఓ తపోధనా ! ఆ రాజుల పరాక్రమము స్వల్పమని తెలికొని వారికి కన్యను ఇచ్చుటకు నేను సమ్మతింపలేదు. అప్పుడు జరిగిన వృత్తాంతము చెప్పెదను వినుడు".

తతః పరమ కోపేన రాజానో మునిపుంగవ |
న్యరుంధన్ మిథిలాం సర్వే వీర్య సందేహమాగతాః ||

స|| హే మునిపుంగవ ! సర్వే రాజానోసందేహ మాగతః తతః పరమ కోపేన మిథిలాం న్యరుంధన్ ||

తా|| "ఓ మునిపుంగవ ! ఆ రాజులందరికి సందేహము వచ్చెను. అప్పుడు చాలాక్రోధముతో మిథిలానగరమును ముట్టడించిరి".

ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుంగవాః |
రోషేణ మహతాss విష్టాః పీడయన్ మిథిలాం పురీం ||

స|| తే నృపపుంగవాః ఆత్మానం అవధూతం (ఇతి) విజ్ఞాయ మహతా రోషేణ మిథిలాం పురీం పీడయన్ అవిష్టాః||

తా|| "ఆ రాజులు తమను అవమానించబడినట్లు తలచి మిక్కిలి కోపముతో మిథిలానగరమును పీడించ సాగిరి".

తతః సంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః |
సాధనాని మునిశ్రేష్ఠ తతోss హం భృశదుఃఖితః ||

స|| హే మునిశ్రేష్ఠ తతః సంవత్సర పూర్ణే సర్వశః సాధనాని క్షయం యాతాని ! తతః అహం భృశ దుఃఖితః ||

తా|| "ఓ మునిశ్రేష్ఠ ఒక సంవత్సరము గడిచినతరువాత అన్ని సాధనములు క్షీణించి పోయినవి. అప్పుడు నేను మిగుల దుఃఖితుడనైతిని".

తతో దేవగణాన్ సర్వాన్ తపసా అహం ప్రసాదయమ్ |
దదుశ్చ పరమప్రీతాః చతురంగ బలం సురాః ||

స|| తతః అహమ్ తపసా సర్వాన్ దేవగణాన్ ప్రసాదయమ్ | పరమప్రీతాః సురాః చతురంగ బలం తదదుః చ ||

తా|| "అప్పుడు నేను తపస్సుతో దేవగణములను అన్నిటినీ ప్రసన్నము చేసికొంటిని. పరమప్రీతులై దేవతలు చతురంగ బలములను ఇచ్చిరి".

తతో భగ్నానృపతయో హన్యమానా దిశోయయుః |
అవీర్యా వీర్యసందిగ్ధాః సామాత్యాః పాపకర్మణః ||

స|| తతః నృపతయోః భగ్నా హన్యమానా అవీర్యాః వీర్య సందిగ్ధాః సామాత్యాం పాపకర్మిణః దిశో యయుః ||

తా|| "అప్పుడు రాజులందరూ భంగపడినవారై పరాక్రమ హీనులై , పాపకర్మలకు ఒడిగట్టిన వారై అన్ని దిక్కులలో పారిపోయిరి".

తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్ |
రామలక్ష్మణయోశ్ఛాపి దర్శయిష్యామి సువ్రత ||

స|| హే మునిశార్దూల ! సువ్రత ! తత్ ఏతత్ పరమభాస్వరం ధనుః రామ లక్ష్మణయోః చ అపి దర్శయిష్యామి ||

తా|| "ఓ మునిశార్దూల ! మంచి వ్రతములు చేసినవాడా ! అట్టి ప్రతిభావంతమైన ధనస్సును రామలక్ష్మణులకు కూడా చూపించెదను".

యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే |
సుతాం అయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్ ||

స|| హే మునేః ! యది అస్య ధనుః రామః ఆరోపణం కుర్యాద్ అయోనిజాం సుతాం దాశరథేః దద్యాం ||

తా|| "ఓ మహామునీ ! ఆ ధనస్సును రాముడుఅ ఏక్కుపెట్టగలిగినచో అయోనిజ అయిన నాకుమార్తెను దశరథ కుమారునికి ఇచ్చెదను".

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే షట్షష్ఠితమస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములోని బాలకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము||

||ఓమ్ తత్ సత్ ||


||om tat sat||